అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీ రఘురామా ॥ పల్లవి ॥
కులమును నీవే గోవిందుఁడా, నా –
కలిమియు నీవే కరుణానిధీ,
తలఁపును నీవే ధరణీధరా, నా –
నెలవును నీవే నీరజనాభా ॥ అంత ॥
తనువును నీవే దామోదరా, నా –
మనికియు నీవే మధుసూదనా,
వినికియు నీవే విట్ఠలుఁడా, నా –
వెనకముందు నీవే విష్ణుదేవుఁడా ॥ అంత ॥
పుట్టుగు నీవే పురుషోత్తమా కొన
నట్టనడుము నీవే నారాయణా,
యిట్టె శ్రీవేంకటేశ్వరుఁడా నాకు
నెట్టన గతి యింక నీవే నీవే ॥ అంత ॥
![](https://i.ytimg.com/vi/F6vA51eEOuE/maxresdefault.jpg)